padyam-hrudyam

kavitvam

Thursday, May 24, 2018

వృద్ధ విలాపం.

కండ్లు మసకలాయె పండ్లూడి పోయెను
తోలు ముడుతలాయె కాలు చెయ్యి
పట్టు దప్పిపోయి పనికి రానైతిని
కన్న వారికైన కర్మ మేమొ.

వయసున కన్న బిడ్డలకు వంతలు సుంతయు సోకకుండ నే
రయమున నన్ని కూర్చుచును రాబడి నెన్నక వారి భావి న
వ్యయ మగు రీతి దిద్దగ నహర్నిశలున్ శ్రమియించి నాడనే
వయసు డుగంగ భారమని వారలె తల్ప నిదేమి కర్మమో.

కాలకృత్యములురా తాళలే రమ్మన్న
..........కస్సున కొడు కొంటి కాల లేచు
మందివ్వరా కన్న మంచివాడ వటన్న
..........వినబోక మనుమడు వేడ్క జూచు
అపరాహ్ణ మాయె నే నాగలే కోడలా
..........అన్నము బెట్టన్న నాగ్రహించు
శీతోష్ణవాతముల్ చెడ్డ బాధాయెను
..........రక్షించు డని పిల్వ రా రొకరును

నేటి కొకసారి కూతురే యేగుదెంచి
నాదు దుస్థితి గని కడు బాధ నొంది
నేను కొరగాని దాన నైనాను నాన్న
యోర్చు కొనమని కన్నీరు గార్చి పోవు.

కాననివాని నూత గొని కానని వాడు చరించు భంగి నా
దానను వృద్ధ నూత  గొని దాపున కాలము వెళ్ళ దీయుటే
ప్రాణము లుండు దాక నిక, బాలలు ప్రోడలు పెద్ద గారొకో
హీనుని  కన్న హీనునిగ  నీ ముదిమిన్ నను జూడ మేలొకో.

శ్రవణుని రీతి పెద్దలను సాకగ గోరము వైనతేయులై
ప్రవిమల భక్తి జన్మ నిడు వారి ఋణమ్మును తీర్చ వేడ మే
యవమతులం  బొనర్చకను నాదరణమ్మున జూడ జాలు మీ
కవగత మౌను మా వ్యధలు కాలవశమ్మున కొంచె మోర్వరే.







No comments: