padyam-hrudyam

kavitvam

Wednesday, July 31, 2024

గ్రామదేవతలు




శ్రీ గురుభ్యోనమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 

ఉ. శ్రీ వసుధాఖ్యవై ధరను శ్రీల నొసంగెడు లక్ష్మివై మనో
భావము లేలు బ్రాహ్మివయి ప్రాణుల యందలి జీవ శక్తివై
పావన భారతావనినిఁ బల్లె జనమ్ములు మ్రొక్కు గ్రామపున్
దేవతవై రహించెదవు దీప్తులఁ జిన్మయరూపిణీ! శివా!

ఉ. మాయను నేర్వరీ జను లమాయకు లెల్లఱు పల్లెపట్టులన్
సాయము గూర్తు గొల్వగుచు జబ్బుల బెంచెడి వాయు ధూళి పా 
నీయ చరాసుభృత్పటలి నిగ్రహణార్థము గ్రామ సీమలన్ 
బాయక యంచు జాలి గొని పాలన జేసెడి తల్లికి న్నతుల్

సీ. పుంతలో ముసలమ్మ ప్రోవవే మా యమ్మ 
..పిలిచిన పలకవే కలుములమ్మ
ఒనుములమ్మా మమ్ము  నొకకంట గనిపెట్టు 
.. కాచి రక్షించవే కాసులమ్మ 
బాపనమ్మా పిల్ల పాపల గాపాడు 
..యేలవే దయతోడ నెరుకలమ్మ
తలుపులమ్మా మాకు గలఁతలు రానీకు 
..మైసమ్మ చూడవే మంచిగాను  

తేగీ. కోట సత్తెమ్మ దుర్గమ్మ కొండతల్లి 
రావులమ్మ సోమాలమ్మ  రాజులమ్మ
దానవయ్యమ్మ పోశమ్మ తల్లులార
వందనాలివె గ్రామదేవతలు మీకు.

తేగీ. అమ్మవారిని దర్శించి అమ్మ మమ్ము 
చల్లగా జూడు మని మ్రొక్కి సన్నుతింప 
గరుణ వెల్లువౌ దృక్కుల గాచు నెపుడు 
గ్రామదేవత పల్లెల ప్రాణశక్తి.