భోగిమంటల జూడ పురవీథి కేగగ
.....పొగలు మంటలు లేక బోసిపోయె
తలయంట్ల కుంకుళ్ళ దలచుచు నడవగా
.....నిద్ర మంచాలపై నెలత లాయె
ముంగిళ్ళ ముగ్గులు మురిపించు ననుకొన్న
.....స్పర్ధలకే యవి పరిమితాయె
గొబ్బియమ్మల గను కోర్కెతో చనుదెంచ
.....గోమయ మంటని భామ లాయె
పట్టణము నందు సంక్రాంతి వట్టి దాయె
పౌష్యలక్ష్మి రాక ప్రజకు పట్టదాయె
చిన్నవోయిన మనసుతో ఖిన్నుడ నయి
పల్లె బాటను బట్టితి బరువుగాను.
*****
తెల్లవారక మున్నె యెల్ల కూడళ్ళలో
.....భోగిమంటల చెంత మూగు జనము
తలయంట్ల నంటగా తల్లులు తలలకు
.....పిడపలతో నొప్పు పిల్ల జనము
రంగవల్లుల దీర్చ రంగుగా రమణులు
.....ముంగిళ్ళ ముత్యాల పొంగు ఘనము
భోగిపండ్ల విహృతి బొమ్మకొల్వుల శోభ
.....తరుణుల పాపల దండితనము
గంగిరెద్దులు గొబ్బిళుల్ ముంగిళులను
ప్రభల జిందించె రైతుకు ప్రమదమాయె
పల్లెపట్టులు పర్వమై పరవశించె
రమ్య రాగాల డోల సంక్రాంతి హేల!